Himachal Pradesh: పదిశాతం కోటాకు హిమాచల్ ప్రదేశ్ కూడా రెడీ
- పదిశాతం కోటాను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా గుజరాత్
- నాలుగో రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్
- చట్ట వ్యతిరేకమంటూ కోర్టును ఆశ్రయించిన డీఎంకే
అగ్రవర్ణాల్లోని పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ రెడీ అయింది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల్లోని పేదలకు పదిశాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ చట్టాన్ని గుజరాత్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అమలు చేస్తున్నట్టు ప్రకటించగా తాజాగా హిమాచల్ ప్రదేశ్ నాలుగో రాష్ట్రం అయింది.
అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లును తొలుత లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదించగా, ఈ నెల 12న రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టంగా రూపాంతరం చెందింది. ఈ చట్టంతో ప్రతిపక్షాలకు ‘మాస్టర్ స్ట్రోక్’ అని బీజేపీ పేర్కొనగా, ఇదంతా పొలిటికల్ స్టంట్ అని ఒమర్ అబ్దుల్లా ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, సామాజిక న్యాయానికి ఈ చట్టం వ్యతిరేకమంటూ డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.