Rajesh Kalia: ఒకప్పుడు చెత్త సేకరించిన వ్యక్తి.. నేడు చండీగఢ్ మేయర్!
- చిన్నప్పుడు తండ్రితో కలిసి చెత్తను సేకరించిన కాలియా
- చదువుకున్నది ఇంటరే
- 1984లో రాజకీయాల్లోకి
ఒకప్పుడు అతడు చెత్త ఏరుకునేవాడు. కానీ ఇప్పుడు చండీగఢ్‌కు మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన ఆయన పేరు రాజేశ్ కాలియా. వాల్మీకి ఓటర్లలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ తమ అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో ఆయనపై ఉన్న కేసులను కూడా పట్టించుకోలేదు. నగరంలో ఉన్న 1.27 లక్షల మంది వాల్మీకి ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో కీలకం కానుండడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.
46 ఏళ్ల కాలియా చదువుకున్నది ఇంటరే. 1984లో రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందు తండ్రితో కలిసి చెత్తను సేకరించి డంప్ చేసేవాడు. ‘‘మేయర్ ఎన్నికకు ముందు నాపై పోలీసు కేసులు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాటికి బదులిస్తున్నా. నాపై నమోదైన కేసులు చాలా చిన్నవి. కేవలం రూ. 50 జరిమానా కట్టాను అంతే’’ అని వివరణ ఇచ్చారు.
1984లో ఆరెస్సెస్‌లో చేరిన కాలియా 1996లో చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేశారు. 2011లో తొలిసారి దాడుమజ్రా నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2016లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఏకంగా మేయర్‌గా ఎన్నికయ్యారు.