Andhra Pradesh: బీజేపీ సభకు జగన్ మనుషులను పంపించారు.. వైసీపీ లాంటి అవినీతి పార్టీ ఏపీకి అవసరమా?: ఏపీ మంత్రి దేవినేని ఉమ
- కోల్ కతా ర్యాలీ విజయవంతం అయింది
- అమరావతిలోనూ మరో ర్యాలీ నిర్వహిస్తాం
- పులివెందులకూ చంద్రబాబు నీళ్లు ఇచ్చారు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న కోల్ కతా లో నిర్వహించిన విపక్ష ర్యాలీ విజయవంతం అయిందని ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమ తెలిపారు. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఈ ర్యాలీ ద్వారా ఒకే వేదికపైకి వచ్చాయన్నారు. త్వరలోనే అమరావతిలోనూ ఇదే తరహాలో భారీ సభను నిర్వహిస్తామని పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని పరిరక్షించే ఫ్రంట్ ఓవైపు ఉంటే, మోదీ-కేసీఆర్-జగన్ ల ఫిడేల్ ఫ్రంట్ మరోవైపు ఉందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ తో చేతులు కలిపిన జగన్ ఏపీ రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం నదులపై అడ్డగోలుగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఉమ ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్ నియోజకవర్గమైన పులివెందులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లు ఇచ్చారని గుర్తుచేశారు. డబ్బు మూటల కోసమే జగన్ కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారని దుయ్యబట్టారు. కడప జిల్లాలో ఇటీవల జరిగిన బీజేపీ సభకు జగన్, వైసీపీ నేతలు మనుషులను పంపారని ఉమ అన్నారు. అసలు కోల్ కతా ర్యాలీకి కేసీఆర్ ఎందుకు రాలేదో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు వైసీపీ లాంటి అవినీతి పార్టీ ఏపీకి అవసరమా? అని ప్రశ్నించారు.