hardic padya: మిస్టర్ హార్దిక్ పాండ్యా... యూత్ ఐకాన్‌గా మీ బాధ్యత గుర్తులేదా?: ప్రియామాలిక్ ఘాటైన వ్యాఖ్యలు
- దుర్మార్గమైన మీ వ్యాఖ్యలతో ఈ తరానికి ఏం చెప్పాలనుకున్నారు
- ఆడవాళ్లను అగౌరవపర్చడం గొప్పతనమా
- మీలాంటి వారికి గుణపాఠం తప్పదు
‘కాఫీ విత్ కరణ్’లో నోటికొచ్చినట్లు మాట్లాడి విమర్శకుల దాడితో తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చుకుని భారత క్రికెట్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన హార్దిక్ పాండ్యాకు కవి, సాహితీవేత్త, ఫైర్‌బ్రాండ్ ప్రియామాలిక్ తన కవిత్వంతో ఘాటైన కౌంటర్ ఇచ్చారు. యూత్ ఐకాన్ అయిన మీరు అంత బాధ్యతరాహిత్యంగా మాట్లాడి ఈ తరానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారని ప్రశ్నించారు. మీలాంటి వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఇండియన్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో తన సహచరుడు రాహుల్‌తోపాటు పాల్గొన్న పాండ్యా ‘ఎంతో మంది అమ్మాయిలతో తనకు ఏదో రూపంలో సంబంధం ఉంది’ అన్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తడం, జట్టు నుంచి తాత్కాలికంగా ఉద్వాసనకు గురికావడం జరిగిపోయాయి. దీనిపై ప్రియామాలిక్ ఓ కవితను పాండ్యాపై రాసి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అమ్మాయిలను అభ్యంతరకరమైన రీతిలో చూసే పుత్ర రత్నాలను మేము ‘వహ్ బేటా ప్రౌఢాప్ యూ’ అని అనలేం అన్నారు.
’తోటివాళ్లు అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, ట్రాన్స్జెండర్లైనా వారిని గౌరవించాలని నేర్పుతాం. జాలి, దయ, కరుణ చూపించాలని సూచిస్తాం. మిస్టర్ పాండ్యా అధికారం, పరపతితోపాటు బాధ్యత కూడా వస్తుందని మీకు అనిపించలేదా? మీ షో ఏడేళ్ల పిల్లాడు చూస్తే మీ వ్యాఖ్యలను వాడు ఎలా తీసుకోవాలో చెప్పగరా?. ఓహో ఆడవాళ్లను ఇలాగే చూడాలనే పురుషాహంకారం వాడిలో స్థిరపడదా?' అంటూ తన కవితలో ఘాటుగా విమర్శించారు ప్రియామాలిక్.
డెహ్రాడూన్‌కు చెందిన ప్రియామాలిక్ ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఆనర్స్ చదివారు. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి ‘అవర్ లేడీ ఆఫ్ సేక్రెడ్ హార్ట్’ అనే పాఠశాల టీచర్‌గా కూడా పనిచేశారు. అక్కడ జరిగిన ‘బిగ్ బ్రదర్’ షోలో ఎదురైన రేసిజంను కూడా పోయిట్రీతోనే తిప్పికొట్టారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యాకు అదే మార్గంలో సమాధానమిచ్చారు.