BJP: రాష్ట్రపతి పాలన విధిస్తారట.. ఏపీ ఏమైనా మీ అబ్బ సొత్తా!: బీజేపీపై మంత్రి శ్రీనివాసులు ఆగ్రహం
- మోదీ, షా కుట్రలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం
- ఏపీ జోలికి వస్తే బీజేపీ నాశనమే
- ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని వ్యాఖ్య
ప్రతిపక్ష నేతలను ప్రధాని నరేంద్ర మోదీ దోపిడీదారులుగా అభివర్ణించడం దారుణమని ఏపీ మంత్రి కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా చేస్తున్న కుట్రలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్ధండులైన రాజకీయ నేతలు మోదీకి దోపిడీదారులుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తే బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘కొంతమంది బీజేపీ నేతలు ఏపీలో రాష్ట్రపతి పాలన విధిస్తామని చెబుతున్నారు. ఏపీ ఏమైనా మీ అబ్బ సొత్తా.. రాష్ట్రపతి పాలన విధించడానికి. పెట్టండి చూద్దాం. ఏపీ జోలికి వస్తే దేశంలో బీజేపీ ఉనికే ఉండదు. మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ఏపీపై కసి తీర్చుకోవాలని భావిస్తే ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు. విపక్షాల ఐక్యతను తట్టుకోలేకే ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాసులు అన్నారు.