Chandrababu: జగన్ ను కలిసిన అనంతరం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మేడా
- చంద్రబాబు అవినీతిని చూడలేకే టీడీపీని వీడాను
- పలు హామీలతో ప్రజలను మోసం చేశారు
- జగన్ ను సీఎం చేయడమే నా లక్ష్యం
టీడీపీకి గుడ్ బై చెప్పిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు చేస్తున్న దోపిడీని చూడలేకే టీడీపీని వీడానని అన్నారు. 'బాబూ, నిన్ను నమ్మలేమంటూ ఇప్పుడు పలువురు నేతలు టీడీపీని వీడుతున్నారని చెప్పారు. కాపు రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి తదితర హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ఇప్పుడు తనకు గంజాయి వనం నుంచి తులసి వనంలోకి వచ్చినట్టుందని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతోనే జగన్ పాదయాత్ర చేశారని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు కలిగిన నాయకుడు జగన్ అంటూ కితాబిచ్చారు. సంతలో పశువులను కొన్నట్టు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని విమర్శించారు. వైయస్ ఆశయాలతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని... రాజంపేటను అభివృద్ధి చేయడం, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. రూ. 800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. చంద్రబాబును ఓడించి, జగన్ ను సీఎం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రేపు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తానని తెలిపారు.