Maharashtra: ముంబయిలో ఉగ్రవాదుల ముఠా అరెస్టు...భారీ కుట్రను భగ్నం చేసిన ఏటీఎస్
- నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తం
- అనుమానితుల కదలికలపై కన్ను
- మొత్తం డజన్ బృందాలతో ఏకకాలంలో దాడులు
మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) భారీ ఉగ్ర కుట్రను నేడు భగ్నం చేసింది. నిఘా వర్గాలందించిన సమాచారం మేరకు గత కొన్ని రోజులుగా అనుమానితులపై నిఘాపెట్టిన ఏటీఎస్.. 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి థానే జిల్లాలోని ముంబ్రా, ఔరంగాబాద్ సహా ఐదుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధం ఉందని భావిస్తున్న 9 మందిని అరెస్టు చేసింది. ఔరంగాబాద్ నుంచి నలుగురు, ముంబ్రా, థానే నుంచి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 17 నుంచి 35 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. ‘మాకు సమాచారం అందేసరికే ఈ ముఠా దాడులకు సిద్ధమైంది. అందుకే ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో దాడులు నిర్వహించాం’ అని ఏటీఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. వీరి వద్ద నుంచి ప్రమాదకరమైన రసాయనాలు, పౌడర్, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్లు, సిమ్ కార్డులు, యాసిడ్ బాటిల్, పదునైన కత్తులు స్వాధీనం చేసుకున్నారు.