Pranab Mukherjee: భారతరత్న అందుకునే అర్హత ప్రణబ్ ముఖర్జీకి లేదు: కేఏ పాల్
- ప్రణబ్ పై అమెరికాలో మా సంస్థ క్రిమినల్ కేసులు వేసింది
- అమెరికా నుంచి ఆయనకు సమన్లు కూడా అందాయి
- ఎవరికి పడితే వారికి భారతరత్న ఇచ్చేస్తారా?
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడాన్ని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తప్పుబట్టారు. ప్రణబ్ కు భారతరత్న ప్రకటించిన రోజు ఓ బ్లాక్ డే అంటూ వ్యాఖ్యానించారు. భారతరత్న పురస్కారాన్ని అందుకునే అర్హత ప్రణబ్ కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రణబ్ పై అమెరికాలో తమ సంస్థ క్రిమినల్ కేసులు వేసిందని చెప్పారు. అమెరికా నుంచి ప్రణబ్ కు సమన్లు కూడా అందాయని తెలిపారు. 2004లో ప్రణబ్ ముఖర్జీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నారని... ఇద్దరూ కలసి ప్రపంచ శాంతి కోసం పని చేస్తున్న గ్లోబల్ పీస్ సంస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు.
క్రిమినల్ కేసు ఎదుర్కొన్న వ్యక్తికి భారతరత్న ఎలా ప్రకటించారో ప్రధాని మోదీ చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. లోక్ సభలో మెజార్టీ ఉంది కదా అని... ఎవరికి పడితే వారికి భారతరత్న ఇచ్చేస్తారా? అని మండిపడ్డారు. ప్రపంచశాంతి కోసం పాటుబడ్డ లోక్ సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగికి అవార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితుడనే కారణంగా బాలయోగికి పురస్కారం ఇవ్వలేదా? అని అడిగారు.