Andhra Pradesh: వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. కుమారుడు హితేశ్ తో కలిసి జగన్ ఇంటికెళ్లిన నేత!
- హితేశ్ రాజకీయ ప్రవేశంపై జగన్ తో చర్చలు
- కుటుంబంతో కలిసి వైసీపీలో చేరేందుకు ప్లాన్
- ప్రస్తుతం బీజేపీలో వున్న పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని జగన్ ఇంటికి ఈరోజు కుమారుడు హితేశ్ తో కలిసి దగ్గుబాటి వెంకటేశ్వరావు చేరుకున్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి వాళ్లను సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకెళ్లారు. దగ్గుబాటి వెంకటేశ్వరావు భార్య పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీ నేతగా, ఎయిరిండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
ప్రకాశం జిల్లాలో పర్చూరు స్థానంపై దృష్టిసారించిన దగ్గుబాటి ఫ్యామిలీ తమ కుమారుడు హితేశ్ చెంచురాంను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం త్వరలోనే వైసీపీలో చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పర్చూరు స్థానంపై జగన్ నుంచి హామీ లభిస్తే భార్య పురందేశ్వరి, కుమారుడు హితేశ్ తో కలిసి దగ్గుబాటి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఇందుకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ అభిప్రాయం ఏంటో ఇంకా వెల్లడి కాలేదు.