Andhra Pradesh: వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం.. ప్రతీ ఎన్టీఆర్ అభిమాని ఈ నిర్ణయాన్ని హర్షిస్తారు!: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
- జగన్ మా నిర్ణయాన్ని స్వాగతించారు
- మంచి రోజు చూసుకుని వైసీపీలో చేరుతాం
- హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన నేత
వైసీపీలో చేరాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. తమ నిర్ణయాన్ని వైసీపీ అధినేత జగన్ స్వాగతించారని అన్నారు. అనుచరులు, మద్దతుదారులతో చర్చించి, మంచి రోజు చూసుకుని తాను, కుమారుడు హితేశ్ వైసీపీలో చేరుతామని ప్రకటించారు. అయితే తన భార్య పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతారని తేల్చిచెప్పారు. జగన్ తో కలిసి పనిచేసేందుకు హితేశ్, తాను సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు జగన్ తో భేటీ అయిన అనంతరం దగ్గుబాటి మీడియాతో మాట్లాడారు.
జగన్ ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి వైసీపీని నడుపుతున్నారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ఏపీలో పేదల బాగు కోసం, అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తులు ఎన్టీఆర్, వైఎస్సార్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని అభిమానించేవాళ్లు ఈ పరిణామాన్ని హర్షిస్తారన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై దగ్గుబాటి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓవైపు నిధులు లేవంటూనే, మరోవైపు ధర్మపోరాట దీక్షలకు కోట్లు ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు.
దీనివల్ల జిల్లాల్లో అధికారులు, పోలీసులు పనులు మానేసి ఈ దీక్షల ఏర్పాట్లు చేయాల్సి వస్తోందన్నారు. డ్వాక్రా మహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వడం వంటి విచిత్ర పరిస్థితి ఇప్పటివరకూ ఎన్నడూ తలెత్తలేదని విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ స్థానాన్ని దగ్గుబాటి కుటుంబం కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ దగ్గుబాటి ఫ్యామిలీకి ఎలాంటి హామీ ఇచ్చారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.