Andhra Pradesh: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి.. జగన్ వచ్చినా ప్రయోజనం ఉండదు!: సీపీఐ నేత రామకృష్ణ
- హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది
- కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాలు చెబుతున్నారు
- కేంద్రం రూ.350 కోట్ల నిధుల్ని వెనక్కు తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా 10 సంవత్సరాలు ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ఉందని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. ఈ విషయంలో అందరికన్నా ఎక్కువగా వెంకయ్యనాయుడు మాట్లాడారని అన్నారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి అసలు బీజేపీ మేనిఫెస్టోలో హోదా విషయమే లేదనీ, మోదీ ఎలాంటి హామీ ఇవ్వలేదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో అధికారం అనుభవించిన కన్నా ఇప్పుడు బీజేపీలో చేరి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
ఏపీని దోచుకున్నవారికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వైద్య రంగాన్ని చంద్రబాబు కార్పొరేట్ పరం చేశారని విమర్శించారు. ఏపీలో ఎన్నడూ లేనంత అవినీతి ప్రస్తుతం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ లంచగొండి ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అధికారంలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.
వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు కేటాయించిన రూ.350 కోట్ల నిధులను కేంద్రం వెనక్కు తీసుకోవడంతో పాటు గత రెండేళ్లుగా ఈ నిధులను మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి రూ.16 వేల కోట్ల సాయం చేయాల్సి ఉండగా, రూ.3 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు.