nadendla bhaskararao: బీసీల సభలు పెడుతున్న చంద్రబాబు బీసీ ప్రధానిని వద్దనడం విడ్డూరం : నాదెండ్ల భాస్కరరావు
- చంద్రబాబు అబద్ధాలు మాని వాస్తవాలతో బయటకు రావాలి
- ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
- ప్రాంతీయ పార్టీ పెట్టడం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు
‘జయహో బీసీ’ అంటూ వెనుకబడిన తరగతులతో సభలు పెడుతున్న చంద్రబాబునాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ బీసీ ప్రధాని (నరేంద్రమోదీ)ని గద్దె దించుతానని అనడం విడ్డూరంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా అబద్ధాలు మాని వాస్తవాలతో ప్రజల ముందుకు రావాలని హితవు పలికారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఆలయాల్లో రాజకీయ ప్రకటనలు చేయడంపై నిషేధం మంచి నిర్ణయమేనని, దీన్ని అధికార పార్టీ సభ్యులకు కూడా వర్తింపజేయాలని సూచించారు. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉందా అంటే అది ప్రాంతీయ పార్టీ పెట్టడం అని అన్నారు. కుల వ్యవస్థ పోతేనే దేశం బాగుపడుతుందన్నారు. ఒకేచోట పనిచేసిన ఉద్యోగులను మూడేళ్లకోసారి బదిలీ చేసినట్లు పదేళ్లు పనిచేసిన ముఖ్యమంత్రిని మార్చే విధానం ప్రజాస్వామ్యంలో అవసరమని అభిప్రాయపడ్డారు.