subhashini: అలా నా ఛాన్స్ రాధికకి వెళ్లింది: జయసుధ చెల్లెలు సుభాషిణి
- నేను పెద్దగా చదువుకోలేదు
- అందుకే నటన వైపుకు వచ్చాను
- అపార్థాల కారణంగా నన్ను తప్పించారు
తెలుగు తెరపై సహజనటిగా అశేష ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న జయసుధకు 'సుభాషిణి' అనే చెల్లెలు వుంది. ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'అరుంధతి'లో పశుపతి తల్లిగా ఆమె ఆ పాత్రలో జీవించారు. ఇప్పటికీ ఆ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోవడానికి గల కారణం ఆమె అభినయమే. అలాంటి సుభాషిణి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని, తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.
"చిన్నప్పటి నుంచి నాకు చదువు పెద్దగా అబ్బలేదు .. దాంతో ఏడవ తరగతితోనే చదువు ఆపేశాను. చదువు నుంచి తప్పించుకోవడానికే నటన వైపుకు వచ్చాను. మొదట నేను ఒక తమిళ సినిమా చేయవలసింది .. తెలుగులో అది 'తూర్పు వెళ్లే రైలు'. తమిళ సినిమా కోసం భారతీరాజా గారు మా ఇంటికి వచ్చి .. నన్ను చూసి ఓకే చేశారు. నాకు డైలాగ్ డెలివరీ .. డాన్స్ కూడా నేర్పించారు. మరుసటి రోజు షూటింగుకి బయల్దేరతామని అనుకుంటూ ఉండగా, నాన్నకి .. వాళ్లకి మధ్య తలెత్తిన అపార్థం కారణంగా నన్ను తప్పించారు. ఆ పాత్ర కోసం రాధికను తీసుకుని ఆమెతోనే చేశారు. అలా నా ఫస్టు ఛాన్స్ మిస్సయ్యింది" అని చెప్పుకొచ్చారు.