Neeraja Reddy: కోట్ల టీడీపీ వైపు చూస్తుండటంతో... తిరిగి కాంగ్రెస్ లో చేరిన నీరజారెడ్డి!
- 2011లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు
- ఆపై ఎమ్మెల్యే పదవికి రాజీనామా
- ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరిన నీరజారెడ్డి
ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి గుర్తున్నారా? 2011లో తన నియోజకవర్గానికి ఏ పనినీ చేయించుకోలేకున్నానని, కోట్ల సూర్యప్రకాశ్ తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెను సంచలనాన్నే సృష్టించారు. 2009 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి తనను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించిన ఆమె, ఎమ్మెల్యేగా ఉండి కూడా తన కార్యకర్తలకు చిన్న చిన్న పనులు కూడా చేసిపెట్టలేకపోతున్నానని ఆమె అప్పట్లో ఆవేదన చెందారు.
అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె, ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ తోనే రీఎంట్రీ ఇచ్చారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, నీరజారెడ్డి కుటుంబానికి, కోట్ల కుటుంబానికీ మధ్య సుదీర్ఘకాలంగా ఆధిపత్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి టీడీపీ వైపు చూస్తుండటంతోనే నీరజా రెడ్డి కాంగ్రెస్ లో చేరారని తెలుస్తోంది. నీరజారెడ్డి భర్త శేషిరెడ్డి, 1989లో పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆపై 1994లో ఎస్వీ సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆపై ఆయన ఫ్యాక్షన్ హత్యకు గురికాగా, ఆ తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి అండతో నీరజారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు.