vijayashanthi: కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకుండా ఏపీకి ప్రత్యేక హోదాను ఎలా సాధిస్తారో అర్థం కావడం లేదు!: విజయశాంతి
- ఏపీకి హోదా ఇవ్వబోమని బీజేపీ తేల్చేసింది
- కాంగ్రెస్ తోనే ఏపీకి హోదా వస్తుంది
- కాంగ్రెస్ కు ఏపీలో రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వకపోవడం దారుణం
విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకుండా ఎన్డీయే ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా కాలయాపన చేసిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. ఏపీలో తమకు ఉనికి లేదనే నిర్ణయానికి బీజేపీ వచ్చేసిందని... అందుకే ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేసిందని దుయ్యబట్టారు.
తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని... అయితే ఏపీలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు అక్కడి రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదని అన్నారు. కాంగ్రెస్ మద్దతు లేకుండా ఏపీకి ప్రత్యేక హోదాను ఎలా సాధిస్తారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. విజయవాడలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో... ప్రత్యేక హోదా కోసం పోరాడటంతో పాటు, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కాంగ్రెస్ ను బలపరుస్తూ తీర్మానం చేస్తే బాగుంటుందని సూచించారు.