ayodhya: అయోధ్య కేసు విచారణ ఆలస్యమవుతున్నందున.. మేము తీసుకోదగిన కనీస చర్య ఇదే: రాంమాధవ్
- వివాదరహిత భూమిని ఇవ్వాలంటూ 23 ఏళ్లుగా రామ జన్మభూమి న్యాస్ కోరుతోంది
- గత ప్రభుత్వాలు న్యాస్ డిమాండ్లను పట్టించుకోలేదు
- సుప్రీంకోర్టు అనుమతి కోసం ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు
అయోధ్య రామ జన్మభూమికి సంబంధించి వివాదరహిత స్థలాన్ని రామ జన్మభూమి న్యాస్ కు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరడం కేంద్ర ప్రభుత్వం తీసుకోదగిన కనీస చర్య అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ ఈ పని చేస్తోందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ భూమిని తమకు ఇవ్వాలంటూ గత 23 ఏళ్లుగా రామ జన్మభూమి న్యాస్ కోరుతోందని గుర్తు చేశారు.
రామ జన్మభూమి న్యాస్ డిమాండ్ ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని రాంమాధవ్ చెప్పారు. సుప్రీంకోర్టు అనుమతి తీసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు. అయోధ్య కేసు విచారణ సుప్రీంకోర్టులో ఆలస్యమవుతోందని... ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోదగిన కనీస చర్య ఇదేనని చెప్పారు. వివాదంలో లేని భూమిని న్యాస్ కు అప్పగిస్తే... అది గొప్ప విషయం అవుతుందని తెలిపారు.