India: లోక్ సభ ఎన్నికలకు ముందు భారత్ లో మతఘర్షణలు జరగవచ్చు!: అమెరికా హెచ్చరిక
- మోదీ హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుంటే ఇబ్బందే
- దేశంలో ముస్లింలు ఏకాకి అయిపోతారు
- ఉగ్రవాదులకు మంచి అవకాశం దొరుకుతుంది
అమెరికాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ కమిటీ చీఫ్, సెనెటర్ డేనియల్ కోట్స్ బాంబు పేల్చారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ హిందుత్వ నినాదాన్ని తలకెత్తుకుంటే భారత్ లో మత ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సెనెట్ సెలక్ట్ కమిటీకి నివేదికను సమర్పించారు. అందులో ప్రపంచవ్యాప్తంగా 2019లో హింస చెలరేగే అవకాశమున్న పరిస్థితులను ప్రస్తావించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ మే నెలలో జరిగే ఎన్నికల్లో హిందుత్వ అజెండాను ప్రధానాంశంగా చేసుకుంటే భారత్ లో మత ఘర్షణలు తప్పవని కమిటీ వ్యాఖ్యానించింది. మోదీ ప్రభుత్వం తొలి ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలతో పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతతత్వం తీవ్రంగా వేళ్లూనుకుందని తెలిపింది.
తమ కార్యకర్తలను, మద్దతుదారులను సంతృప్తి పరిచేందుకు హిందుత్వ నేతలు తక్కువస్థాయి హింసకు పాల్పడే అవకాశముందని కమిటీ నివేదికలో పేర్కొంది. దీనివల్ల భారతీయ ముస్లింలు ఏకాకి అవుతారనీ, దీన్ని ఉగ్రసంస్థలు వాడుకునే అవకాశముందని హెచ్చరించింది. అలాగే భారత్-పాక్ మధ్య సంబంధాలు మే నెలలో ఎన్నికలు జరిగేవరకూ మెరుగయ్యే అవకాశాలు లేవని తేల్చిచెప్పింది.