surendra singh: శూర్పణఖలాంటి ప్రియాంకగాంధీని రాహుల్ బరిలోకి దింపారు: బీజేపీ నేత సురేంద్ర సింగ్
- కాంగ్రెస్ కు ఒక రాజకీయ విధానం అంటూ ఏమీ లేదు
- ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలవలేదు
- మునిగిపోయే నావలాంటిది కాంగ్రెస్ పార్టీ
ఎస్సీ, ఎస్టీ చట్టం వివాదం కారణంగానే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించగలిగిందని యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చెప్పారు. కాంగ్రెస్ కు ఓ రాజకీయ విధానం అంటూ ఏదీ లేదని... రానున్న ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలవబోదని అన్నారు. మునిగిపోయే నావలాంటిది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రావణాసురుడు వంటి వారని, ఆయన సోదరి ప్రియాంకగాంధీ శూర్పణఖలాంటి వారని సురేంద్ర సింగ్ విమర్శించారు. రాముడిపై యుద్ధం చేసేముందు ఆయనను ఎదుర్కొనేందుకు రావణుడు తొలుత ఆయన సోదరి శూర్పణఖను పంపాడని... ఇప్పుడు రాహుల్ కూడా మోదీని ఎదుర్కొరేందుకు శూర్పణఖలాంటి ప్రియాంకను బరిలో నిలిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతిని ట్రాన్స్ జెండర్ గా అభివర్ణిస్తూ తమ ఎమ్మెల్యే సాధనాసింగ్ చేసిన వ్యాఖ్యలను సురేంద్ర సింగ్ సమర్థించారు. ఆత్మగౌరవం లేనివారిని ట్రాన్స్ జెండర్ అంటారని... సమాజ్ వాదీ పార్టీతో జతకట్టడం ద్వారా తనకు ఆత్మగౌరవం లేదని మాయావతి నిరూపించుకున్నారని చెప్పారు.