Andhra Pradesh: ఏపీ మంత్రి కేఈ కృష్ణమూర్తికి తీవ్ర అవమానం.. ఆలయ భూకర్షణకు ఆహ్వానం పంపని టీటీడీ అధికారులు!
- గుంటూరు జిల్లాలో వేంకటేశ్వరస్వామి ఆలయం
- నేడు భూకర్షణ, బీజావాపనం కార్యక్రమాలు
- అధికారుల తీరుపై మనస్తాపంతో మంత్రి గైర్హాజరు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ.150 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలోని వెంకటపాలెంలో ఈరోజు జరిగిన భూకర్షణం, బీజావాపనం కార్యక్రమానికి సాక్షాత్తూ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తికి ఆహ్వానం అందలేదు.
దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలి పట్ల మంత్రి తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకుని గైర్హాజరు అయ్యారు. సాక్షాత్తూ దేవాదాయ శాఖ మంత్రికే ఆహ్వానం అందకపోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంకటపాలెంలో ఆలయ నిర్మాణానికి సీఆర్డీఏ టీటీడీకి 25 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదు ఎకరాల్లో ఆలయం, మిగిలిన 20 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. ఈ 20 ఎకరాల్లో ఆలయానికి అనుబంధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఆడిటోరియాలు, కల్యాణ మండపాలతో పాటు ఇతర కీలక నిర్మాణాలు చేపట్టనున్నారు.