BSE: దలాల్ స్ట్రీట్ కళకళ.. భారీ లాభాలలో నేటి మార్కెట్లు
- అంతర్జాతీయంగా సానుకూలాంశాలు
- 665 పాయింట్ల పైగా సెన్సెక్స్ లాభం
- 179 పాయింట్ల పైగా నిఫ్టీకి లాభం
గత నాలుగు సెషన్లుగా నష్టాల బాటలో వున్న మన స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలు పండించుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో మార్పు చేయకపోవడంతో అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు వెలువడడంతో ఈ రోజు ఆసియా మార్కెట్లు లాభాలతో వెలిగాయి.
ఇక రేపు ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్టు మధ్యతరగతికి, వ్యవసాయదారులకు సానుకూలంగా ఉంటుందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మన మార్కెట్లు ఈ రోజు ప్రారంభం నుంచీ లాభాలతోనే ట్రేడ్ అయ్యాయి. మదుపరులు కొనుగోళ్లకు ఉత్సాహం చూపారు. ఈ క్రమంలో సెన్సెక్స్ ఏకంగా 665.44 పాయింట్లు పెరిగి 36256.69 వద్ద, నిఫ్టీ 179.15 పాయింట్లు పెరిగి 10,830.95 వద్ద ముగిశాయి.
నేటి ట్రేడింగులో యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, గెయిల్, ఇన్ఫోసిస్, కోటక్ మహేంద్ర, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాలు పొందగా, ఎస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి.