BSP: మాయావతి హయాంలో కుంభకోణం.. యూపీలో ఈడీ తనిఖీలు
- స్మారకాల నిర్మాణాల కుంభకోణం
- లక్నోలో ఏకకాలంలో ఏడు చోట్ల ఈడీ తనిఖీలు
- పలు పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో దేశ వ్యాప్తంగా పలు ప్రతిపక్షపార్టీలు మహాకూటమి రూపంలో పోరాటానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్ లో ఉప్పూనిప్పూగా ఉండే సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు సైతం జత కట్టాయి. ఇదిలా ఉండగా, యూపీలో నాడు జరిగిన కుంభకోణాలు మళ్లీ తెరపైకొస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ కుంభకోణాలకు మళ్లీ తెరదీయడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
యూపీ సీఎంగా ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ ఉన్న సమయంలో చోటుచేసుకున్న గనుల తవ్వకాల కుంభకోణంపై ఈడీ అధికారులు ఇటీవలే సోదాలు ప్రారంభించడం ఇందుకు నిదర్శనం. తాజాగా, బీఎస్పీ అధినేత్రి మాయావతి అధికారంలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న స్మారకాల నిర్మాణాల కుంభకోణంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్, ఆ పార్టీ గుర్తు ‘ఏనుగు’ విగ్రహాల నిర్మాణాలను నాడు యూపీ వ్యాప్తంగా చేపట్టారు. ఇందుకుగాను, ఖజానా సొమ్మును వెచ్చించారన్నది ఆరోపణ.
దీనివల్ల కొందరు ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు లాభపడ్డారని ఆరోపిస్తూ యూపీ విజిలెన్స్ కమిషన్ లో దాఖలైన ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. లక్నోలోని కొందరు అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లల్లో ఏకకాలంలో ఏడు చోట్ల తనిఖీలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా, 2007-12 మధ్య కాలంలో యూపీ సీఎంగా మాయావతి ఉన్నారు.