Andhra Pradesh: ఏపీకి న్యాయం చేస్తారని చివరి బడ్జెట్ వరకూ ఎదురుచూశాం!: చంద్రబాబు
- మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు
- ఈ నెల 11-14 మధ్య ఢిల్లీలో ధర్మపోరాటం
- టీడీపీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తారన్న ఆశతో చివరి బడ్జెట్ వరకూ ఎదురుచూశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఐదేళ్ల పాటు వేచిచూసినా ఏపీకి ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని విమర్శించారు. మోదీ విశాల దృక్పథం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందనీ, ఏపీపై కక్ష సాధించడం విశాల దృక్పథమా? అని ప్రశ్నించారు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
యూపీ మాజీ సీఎంలు అఖిలేశ్ యాదవ్, మాయావతిలపై కేంద్ర విచారణ సంస్థలతో దాడి చేయిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని విశాల దృక్పథం అనాలా? అని నిలదీశారు. బీజేపీయేతర పార్టీలను వేధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇలాంటివారికి ఏపీతో పాటు దేశ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కేంద్రంపై పోరాటంలో భాగంగా నేటి నుంచి ఈ నెల 10 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 11 నుంచి 14 వరకూ ఢిల్లీలో ధర్మపోరాటం చేస్తామన్నారు. ఈ పోరాటానికి దేశంలోని మిగతా రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామనీ, రాష్ట్రపతికి వినతిపత్రం అందిస్తామని పేర్కొన్నారు.
ఆ తర్వాతే ప్రజల్లోకి వెళతామనీ, అక్కడే అమీతుమీ తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం హైకోర్టులో రూ.250 కోట్లు డిపాజిట్ చేస్తామనీ, బాధితులను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.