Crime News: బంధువుల్లా వస్తారు...అందింది ఎత్తుకెళతారు: జల్సాల కోసం కి'లేడి' జంటలు చోరీల మార్గం
- శుభకార్యాలు జరిగే ఇళ్లే టార్గెట్
- మహిళ విడిది గదిలోకి వెళ్లి విలువైన వస్తువుల అపహరణ
- కాపలాగా బయట భర్త
కల్యాణ మండపాలు, ఇళ్ల వద్ద భారీ ఎత్తున జరుగుతున్న వివాహం, ఇతర శుభకార్యాలే వారి టార్గెట్. ముక్కు మొహం తెలియని వారైనా వారింటికి ఎంచక్కా బంధువుల్లా వెళ్లిపోతారు. మహిళల విడిది గదిలో తిష్టవేసి అవకాశం చిక్కినప్పుడు విలువైౖన బంగారం, వస్తువులతో వుడాయిస్తారు. జల్సాలకు అలవాటుపడిన ఓ జంట ఎంచుకున్న మార్గం ఇది. పథకం ఫెయిలై పోలీసులకు చిక్కారు.
ఆ వివరాలలోకి వెళితే, హైదరాబాద్, పహాడీ షరీఫ్ ఠాణా పరిధిలోని సాహీన్‌నగర్ సహదీ హోటల్ సమీపంలో నివసిస్తున్న నసీమ్ ఫాతిమా అలియాస్ నసీమ్ (35) మొదటి భర్తను వదిలేసి అదే ప్రాంతానికి చెందిన షేక్ మొహ్మద్ అబిద్ షరీఫ్ అలియాస్ బాబ్జానీ (28)ని పెళ్లి చేసుకుంది. జల్సాలకు అలవాటు పడిన నసీమ్ డబ్బుకోసం చోరీ మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకు భర్త సహకారాన్ని ఎంచుకుంది. శుభకార్యాలు జరిగే మండపాలకు వెళ్లి నగదు, సెల్‌ఫోన్లు, నగదు చోరీ చేసేది. పెద్దగా జనం లేని ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న ఇళ్లకు బురఖా ధరించి వెళ్లి ఎవరూ చూడకుంటే సెల్‌ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు చోరీ చేసేది. ఈ సమయంలో భర్త బయట కాపలా ఉండేవాడు.
ఈ విధంగా వీరు చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని ఒమర్ గుల్షన్, ఓఎస్ ప్యాలెస్, ఫూల్‌బాగ్, బండ్లగూడ ప్రాంతాల్లోని కల్యాణ మండపాలు, అమీన్ కాలనీలోని ఇళ్లలో 6 చోరీలకు, హుస్సేనీ ఆలం ఠాణా పరిధిలో ఓ చోరీకి పాల్పడ్డారు. ఈ నేపధ్యంలో గురువారం సలాలా ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా చిక్కారు. వీరి నుంచి 13 తులాల బంగారు నగలు, 10 తులాల వెండి ఆభరణాలు, రూ.27 వేల నగదు, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.