Karnataka: ఆరు నెలలుగా నా కొడుకు కుమారస్వామిని కాంగ్రెస్ అవమానిస్తోంది: మాజీ ప్రధాని దేవగౌడ ఆవేదన
- సీఎంను హేళన చేసి మాట్లాడడం దారుణం
- ఇన్నాళ్లు మౌనం వహించాను
- ఇక చూస్తూ ఊరుకోలేను
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవగౌడ నోరు తెరిచారు. కాంగ్రెస్ వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. ‘రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మర్చిపోయి ఆరు నెలలుగా నా కొడుకు కుమారస్వామి పట్ల కాంగ్రెస్ అవమానకరంగా వ్యవహరిస్తోంది. హేళన చేసి మాట్లాడుతోంది. ఇన్నాళ్లు మౌనంగా భరించాను. ఇకపై చూస్తూ ఊరుకోలేను’ అని స్పష్టం చేశారు.
బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీతో పొత్తుపెట్టుకునేటప్పుడు ఇలాగేనా మాట్లాడేది, ప్రవర్తించే తీరు ఇదేనా? అని ధ్వజమెత్తారు. నా కొడుకును తక్కువచేసి మాట్లాడడం పార్టీ నాయకులకు అవాటుగా మారిపోయింది, నోటికొచ్చినట్లు మాట్లాడవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అని దేవగౌడ ప్రశ్నించారు.
ఇటీవల కాంగ్రెస్ నాయకుడు పుట్టరంగ శెట్టి మాట్లాడుతూ ‘నా దృష్టిలో ఇప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు మళ్లీ చేస్తే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేవగౌడ మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ తీరును తప్పుపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.