Andhra Pradesh: నాకు ఎంపీగా పోటీ చేయాలని ఉంది: గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల
- నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయమంటున్నారు
- పార్టీ అభిప్రాయం, నిర్ణయం మేరకు నడుచుకుంటా
- ఎమ్మెల్యేగా గుంటూరుని తీర్చిదిద్దలేకపోయా
ఏపీలో ఈసారి జరిగే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచన తనకు బలంగా ఉందని, ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లానని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని, ఈ విషయమై తాను పోరాడాల్సిన అవసరం ఉందని, అందుకే, ఈసారి ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీగా చేశానని, ప్రస్తుతం ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని అన్నారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా తనను పోటీ చేయమని అక్కడి ప్రజలు తనను కోరుతున్నారని, పార్టీ అభిప్రాయం, నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు.
గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రజల కోసం పోరాడానన్న సంతృప్తి తనకు ఉందని అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, అధికారుల సహకారం లేకపోవడంతో, పదే పదే వారిని మార్చడంతో తన ‘మార్క్’ వేసుకోలేకపోయానని అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదిరి గుంటూరును తీర్చిదిద్దాలనుకున్న తన కల నెరవేరలేదని, సీఆర్డీఏ వివక్ష చూపించిందని ఆరోపించారు. విజయవాడను తీర్చిదిద్దిన తరహాలో గుంటూరు నగరాన్ని చేయలేదని భావిస్తున్నట్టు చెప్పారు.