USA: అమెరికాలో భారతీయ విద్యార్థుల విడుదలకు తక్షణ చర్యలు చేపట్టాలి: పవన్ కల్యాణ్

  • విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు
  • విద్యార్థులకు అవసరమైన సాయం అందించాలి
  • ఎన్నారై జనసేన ప్రతినిధులకు విజ్ఞప్తి

అమెరికాలో నకిలీ విద్యార్థి వీసా రాకెట్ లో పలువురు తెలుగు విద్యార్థులు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అమెరికాలో ఇమిగ్రేషన్‌ అధికారుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించాలని కోరారు. వారిని విడుదల చేయించేందుకు అవసరమైన చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. యూఎస్ లో ఎంఎస్‌ చదివేందుకు వెళ్లి కేసుల్లో చిక్కుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అరెస్ట్ అయినవారిలో ఎక్కువమంది తెలుగువారు ఉన్నారన్న వార్తలు బాధిస్తున్నాయని పేర్కొన్నారు.

అమెరికా ప్రభుత్వమే మిచిగన్ రాష్ట్రంలో నకిలీ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసి, విద్యార్థులను ట్రాప్ చేసి అందులో చేరిన విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం విచారకరమని ఆరోపించారు. ఈ విషయంలో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అవసరమైన సాయాన్ని అందించాలని ఎన్నారై జనసేన ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కళాశాల దశ నుంచే అవగాహన శిబిరాలను నిర్వహించాల్సిన బాధ్యతను విద్యా శాఖతోపాటు కళాశాలలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

  • Loading...

More Telugu News