Hyderabad: వేధిస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన హైదరాబాద్ మహిళ!
- స్నేహితురాలి ద్వారా ఫోన్ లో పరిచయమై వేధింపులు
- లాడ్జికి రావాలని అడగడంతో పోలీసులను ఆశ్రయించిన మహిళ
- అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించిన పోలీసులు
తన స్నేహితురాలి ద్వారా ఫోన్ లో పరిచయమైన ఓ వ్యక్తి, నిత్యమూ వేధిస్తుంటే, అతన్ని పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించిందో మహిళ. హైదరాబాద్, గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం, బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, లక్నోకు చెందిన మరో మహిళ పరిచయం అయింది. వారిద్దరూ తరచూ చాటింగ్ చేసుకునేవారు. లక్నో మహిళ తన స్నేహితురాలి ఫోన్ నంబర్ ను ముభాషేర్ హుస్సేన్ అనే మిత్రుడికి ఆమె అనుమతితోనే ఇచ్చింది.
దీంతో తరచూ ఫోన్ చేస్తున్న హుస్సేన్, మహిళను వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో తాను హైదరాబాద్ కు వస్తున్నానని, సికింద్రాబాద్ సమీపంలోని లాడ్జిలో ఉంటానని, తన వద్దకు రావాలని కోరాడు. అతని వేధింపులు తట్టుకోలేని ఆమె, గోపాలపురం పోలీసులను ఆశ్రయించింది. వారు లాడ్జ్ పై దాడి చేసి, హుస్సేన్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. అతని సెల్ ఫోన్ ను విశ్లేషిస్తున్నామని తెలిపారు.