justice nv ramana: ఏపీ హైకోర్టు నిర్మాణం చారిత్రాత్మకం.. న్యాయ సమస్యలు రాకుండా భూసేకరణ చేయడం గొప్ప విషయం: జస్టిస్ ఎన్వీ రమణ
- భూములిచ్చిన రైతులను తరతరాలు గుర్తుంచుకుంటాయి
- న్యాయ వ్యవస్థలో ఎన్నో ఒత్తిడులు ఉంటాయి
- ఒక్క రోజులో ధర్మ స్థాపన జరగదు
ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది. మరోవైపు, తాత్కాలిక హైకోర్టును నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, అమరావతికి భూములిచ్చిన రైతులను అభినందించారు. రైతుల త్యాగాలను తరతరాలు గుర్తుంచుకుంటాయని చెప్పారు. రాజధానితో పాటు హైకోర్టు నిర్మాణం చారిత్రాత్మకమని అన్నారు. ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా భూసేకరణ జరపడం గొప్ప విషయమని చెప్పారు. న్యాయ వ్యవస్థలో ఎన్నో ఒత్తిడులు ఉంటాయని అన్నారు. న్యాయ వ్యవస్థ అంటే జడ్జిలు, లాయర్లు మాత్రమే కాదని చెప్పారు. ఒక్క రోజులో ధర్మ స్థాపన జరగదని అన్నారు.
జస్టిస్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, హైకోర్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత కనిపించిందని కితాబిచ్చారు. అమరావతికి హైకోర్టు రావడంతో ఏపీ ప్రజలకు న్యాయం మరింత చేరువలో ఉంటుందని తెలిపారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో హైకోర్టు ఉండాలనే ఏపీ ప్రజల కోరిక నెరవేరిందని చెప్పారు. దేశంలోనే ఏపీ హైకోర్టు గొప్పదిగా వెలుగొందాలని ఆకాంక్షించారు.