amaravathi: అమరావతి నిర్మాణంలో హైకోర్టు భవనం ప్రారంభం ప్రధాన ఘట్టం: సీఎం చంద్రబాబు

  • సుప్రీంకోర్టు సీజేఐ, న్యాయమూర్తులను అభినందిస్తున్నా
  • రాబోయే రోజుల్లో ఈ సిటీని ‘జస్టిస్ సిటీ’గా చేయాలి
  • అమరావతిలో ‘నల్సార్’ ఏర్పాటుకు సహకరించాలి

అమరావతి నిర్మాణంలో హైకోర్టు భవనం ప్రారంభం ప్రధాన ఘట్టమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలోని నేలపాడులో హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ, ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. సుప్రీంకోర్టు సీజేఐ, న్యాయమూర్తులను అభినందిస్తున్నానని, రాబోయే రోజుల్లో ఈ సిటీని ‘జస్టిస్ సిటీ’గా తయారు చేయడానికి అవసరమైన సహకారం అందించాలని కోరుకుంటున్నానని, అందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీకి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని, రాజధాని నిర్మాణానికి భూములిచ్చి సహకరించిన రైతులందరికీ మరోమారు కృతఙ్ఞతలు తెలియజేశారు. రైతుల త్యాగం వృథా కాకుండా అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తున్నామని, బౌద్ధ స్థూపం ఆకారంలో అద్భుతరీతిలో న్యాయనగరం నిర్మిస్తామని, ఇక్కడే న్యాయాధికారులు, సిబ్బందికి ఉచిత వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.

నాడు హైదరాబాద్ లో నల్సార్ యూనివర్శిటీ ఏర్పాటుకు తాను ఎంతో కృషి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అమరావతిలో కూడా ‘నల్సార్’ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సహకరించాలని కోరారు. ‘నల్సార్’ ఏర్పాటుకు అవసరమైన భూమి ఇస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న ఎన్నో సమస్యలు, అవాంతరాలను అధిగమిస్తున్నామని, అమరావతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కోర్టుల్లో 1.70 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కేసులు వేగతవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిఙ్ఞానం అమలు చేస్తామని, ఏపీలో రానున్న నవ్య ఆవిష్కరణలు న్యాయవ్యవస్థకు కూడా దోహదం చేస్తాయని, పెరిగిన సాంకేతిక పరిఙ్ఞానంతో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News