amaravathi: అత్యంత ఆధునిక నిర్మాణ శైలిలో హైకోర్టు భవనం నిర్మించారు: సీజేఐ రంజన్ గొగొయ్ ప్రశంసలు
- ఏపీకి కొత్త హైకోర్టు రావడం ప్రజలకు ఆనందదాయకం
- రాజ్యాంగబద్ధమైన విధిని సకాలంలో సీఎం నిర్వర్తించారు
- న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది
అమరావతిలో అత్యంత ఆధునిక నిర్మాణ శైలిలో హైకోర్టు భవనం నిర్మించారని సీజేఐ రంజన్ గొగొయ్ ప్రశంసించారు. అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి కొత్త హైకోర్టు రావడం ప్రజలందరికీ ఆనందదాయకమైన విషయమని అన్నారు. హైకోర్టు భవనం ఏపీ ప్రజల సంస్కృతి, ఆనందానికి ప్రతీకగా నిలుస్తోందని, రాజ్యాంగబద్ధమైన విధిని సక్రమంగా, సకాలంలో సీఎం నిర్వర్తించారని ప్రశంసించారు.
న్యాయవ్యవస్థలో రాజ్యాంగ విలువలకే తప్ప, వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండకూడదని, న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సవాళ్లలో కేసుల పెండింగ్ సమస్య ప్రధానమైందని అన్నారు. గత ఏడాదిలో పెండింగ్ లో ఉన్న కేసులు 81 లక్షలు ఉన్నాయని, పదేళ్లుగా 25 లక్షలు కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కేసుల సత్వర పరిష్కారానికి కొన్ని అవాంతరాలు ఉన్నాయని అన్నారు. న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేస్తే సమస్యలు తగ్గుతాయని, కింది స్థాయి, జిల్లా స్థాయి కోర్టుల్లోనూ 5 వేల ఖాళీలు ఉన్నట్టు చెప్పారు.