new zealand: భారత్ ఘన విజయం... 4-1తో సిరీస్ కైవసం
- 35 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్
- 252 పరుగులకు ఆలౌట్ అయిన ఇండియా
- 217 పరుగులకు ముగిసిన కివీస్ ఇన్నింగ్స్
హామిల్టన్ లో న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కివీస్ ను 35 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 5-1 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంతో తెలుగు తేజం అంబటి రాయుడు, విజయ్ శంకర్ భారత్ ను ఆదుకున్నారు. ఇద్దరూ కలసి 98 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అంబటి రాయడు 113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్ లో మన్రోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జాదవ్ 34, విజయ్ శంకర్ 45 పరుగులు చేసి తమ వంతు సహకారం అందించారు. మిగిలిన బ్యాట్స్ మెన్లు ఎవరూ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు.చివర్లో హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 45 పరుగులు సాధించాడు. మరో భారీ షాట్ కు యత్నించి నీషమ్ బౌలింగ్ లో బౌల్ట్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో, 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఇండియా ఆలౌట్ అయింది.
అనంతరం 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కూడా తడబాటుకు గురైంది. 38 పరుగులకే కివీస్ మూడు వికెట్లను కోల్పోయింది. విలియంసన్, లాథమ్ లు ఇన్నింగ్స్ ను నిర్మించారు. ఇద్దరూ కలసి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కివీస్ బ్యాట్స్ మెన్లలో 44 పరుగులు చేసిన నీషమ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరెవరూ పెద్ద స్కోరు చేయలేకపోయారు. కివీస్ బ్యాట్స్ మెన్లలో నికోల్స్ 8, విలియం సన్ 39, టేలర్ 1, లాథమ్ 37, గ్రాండ్ హోమ్ 11, శాంట్నర్ 22, ఆస్లే 10, హెన్రీ 17, బౌల్ట్ 1 పరుగు చేశారు. హెన్నీ నాటౌట్ గా నిలిచాడు. 44.1 ఓవర్లలో 217 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీయగా షమీ, పాండ్యాలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్, జాధవ్ లు చెరో వికెట్ తీశారు.
90 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన అంబటి రాయుడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా మొహమ్మద్ షమీ ఎంపికయ్యాడు.