delhi: ఢిల్లీలో ఈసీ అధికారులతో ముగిసిన విపక్షాల సమావేశం
- ఈవీఎంలపై నమ్మకం లేదని తేల్చి చెప్పిన విపక్షాలు
- కాలపరిమితితో సమాచారమివ్వాలని కోరిన వైనం
- ఈసీ అధికారులను గట్టిగా ప్రశ్నించిన చంద్రబాబు
ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులతో విపక్షాల సమావేశం ముగిసింది. ఎన్నికల సంఘంపై ఉన్న నమ్మకం ఈవీఎంలపై లేదని విపక్షాలు తేల్చి చెప్పాయి. ఈ విషయంలో కాలపరిమితితో ఎన్నికల సంఘం విపక్షాలకు సమాచారమివ్వాలని కోరినట్టు సమాచారం.
కొత్తగా ఏమీ అడగట్లేదని, ఉన్న వ్యవస్థను అమలు చేయాలని, ఈ విషయమై ఎందుకు సమాధానమివ్వరని ఏపీ సీఎం చంద్రబాబు నిలదీసినట్టు తెలుస్తోంది. ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్ స్లిప్స్ ఎందుకు లెక్కించరని, 50 శాతం వీవీ ప్యాట్స్ ను లెక్కించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాల సమాచారం.
రేపటి సమావేశంలో ఈ విషయాలు చర్చిస్తామని సీఈసీ అధికారులు వారితో చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తామని ఎన్నికల కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లవాసా చెప్పారని, ఈవీఎంలపై తయారు చేసిన రెండు పుస్తకాలను ఎన్నికల సంఘం విపక్షాలకు అందజేసినట్టు సమాచారం. కాగా, శరద్ పవార్ నివాసంలో పలువురు నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో శరద్ పవార్, చంద్రబాబు, కేజ్రీవాల్, డెరెక్ ఒబ్రెయిన్, ప్రేమ్ చంద్రన్ తదితరులు పాల్గొన్నారు.