cbi: ఈ తీర్పు మమతా బెనర్జీ సర్కార్ కు ఎదురుదెబ్బ: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
- సీబీఐ విచారణకు రాజీవ్ హాజరు కావాలన్న ‘సుప్రీం’
- చట్టం ముందు ఎవరూ ఎక్కువ కాదన్నది రుజువైంది
- ఈ తీర్పును స్వాగతిస్తున్నాం
శారదా చిట్ ఫండ్స్ కుంభకోణం దర్యాప్తు వ్యవహారంలో కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహకరించడం లేదంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తునకు రాజీవ్ కుమార్ హాజరు కావాల్సిందేనని ఆదేశించిన న్యాయస్థానం, ఆయన్ని తక్షణమే అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలివ్వడంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామని, చట్టం ఎవరూ ఎక్కువ కాదని దీని ద్వారా రుజువైందని అన్నారు. ఈ తీర్పు మమతా బెనర్జీ సర్కార్ కు ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, దీన్ని రాజకీయం చేయొద్దని రవిశంకర్ ప్రసాద్ కోరారు.
ఇదిలా ఉండగా, ఈ తీర్పుపై మమతా బెనర్జీ కూడా హర్షం చేశారు. ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు తమ నైతిక విజయంగా అభివర్ణించారు. అయితే, ప్రతిపక్ష నేతలతో చర్చల అనంతరం తాము చేస్తున్న ధర్నాను విరమించే విషయమై ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు.