West Bengal: బెంగాల్ పరిణామాలను దేశ వ్యాప్తంగా గమనిస్తున్నారు: సీఎం చంద్రబాబు
- ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది
- ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల కన్నా దారుణంగా ఉంది
- అన్యాయంపై పోరాడేందుకు మేము ఏకతాటిపై ఉన్నాం
పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలను దేశ వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మూడు రోజుల పాటు చేపట్టిన ‘సేవ్ ది ఇండియా’ ధర్నాను బాబు ఈరోజు విరమింపజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, కొన్ని అంశాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంటాయని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లందరినీ నియంత్రించాలని చూస్తున్నారని, మోదీ, అమిత్ షా మినహా అందరూ అవినీతి పరులనే ముద్ర వేస్తున్నారని, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.
ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రమాదంలో పడిందని, అన్యాయంపై పోరాడేందుకు తామంతా ఏకతాటిపై ఉన్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి పని చేస్తామని చెప్పారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితి కంటే దేశంలో ప్రస్తుత పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని విమర్శించారు.