wellington: తొలి టీ20లో చిత్తుగా ఓడిన టీమిండియా
- 219 పరుగులు చేసిన న్యూజిలాండ్
- 139 పరుగులకే ఆలౌటైన భారత్
- 43 బంతుల్లో 84 పరుగులు చేసిన సీఫ్రెస్ట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో రాణించిన కివీస్ భారత్ పై 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 219 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్ల పాటు క్రీజులో నిలబడలేక పోయింది. 19.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది.
అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరును సాధించింది. 84 పరుగులు చేసిన సీఫ్రెస్ట్ విశ్వరూపం ప్రదర్శించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో మన్రో 34, విలియంసన్ 34, మిచెల్ 8, టేలర్ 23, గ్రాండ్ హోమ్ 3, శాంట్నర్ 7, కుగ్లీన్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా... భువనేశ్వర్, అహ్మద్, కృనాల్ పాండ్యా, చాహల్ లు చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే సౌథీ షాక్ ఇచ్చాడు. రోహిత్ శర్మ (1)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ధావన్ 29, విజయ్ శంకర్ 27, ధోనీ 39 పరుగులు చేసినా... క్రీజులో నిలబడలేక పోయారు. ఇతర బ్యాట్స్ మెన్లలో పంత్ 4, దినేష్ కార్తీక్ 5, హార్దిక్ పాండ్యా 4, కృణాల్ పాండ్యా 20, భువనేశ్వర్ కుమార్ 1, చాహల్ 1, అహ్మద్ ఒక్క పరుగు చేశారు. దీంతో, 19.2 ఓవర్లలో భారత్ 139 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో సౌధీ 3, ఫెర్గ్యూసన్ 2, శాంట్నర్ 2, సోథీ 2 వికెట్లు తీయగా... మిచెల్ ఒక వికెట్ పడగొట్టాడు. 43 బంతుల్లో 84 పరుగులు చేసిన సీఫ్రెస్ట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.