Andhra Pradesh: డబ్బు అందని డ్వాక్రా మహిళలకు మరో చాన్స్... త్వరలోనే 'పసుపు-కుంకుమ 2'!
- కొత్త సభ్యులకు అందని చెక్కులు
- ఆన్ లైన్లో నమోదు చేయించుకోవాలని సూచన
- త్వరలోనే చెక్కులు అందుతాయన్న మెప్మా
'పసుపు - కుంకుమ' పేరిట డ్వాక్రా పొదుపు సంఘాల్లోని మహిళలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన చంద్రబాబు, మరో వరాన్ని ప్రకటించారు. త్వరలోనే 'పసుపు - కుంకుమ' రెండో విడత ఆర్థిక సహాయం పంపిణీకి నిర్ణయించారు. కొత్తగా ఏర్పడిన డ్వాక్రా సంఘాలకు, జనవరి 18 నాటికి సంఘంలో సభ్యురాలిగా ఉండి, ఆన్ లైన్ జాబితాలో పేర్లు లేనివారికి కూడా డబ్బు సాయం చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు మెప్మా ఉన్నతాధికారులు తెలిపారు.
తొలి విడతలో పేరు నమోదుకాక, చెక్కును పొందలేనివారికి ఈ దఫా అవకాశం ఉంటుందని అన్నారు. బ్యాంక్ పాస్ బుక్, ఆరు నెలల సంఘ తీర్మాన ప్రతులు, ఆధార్ నెంబరు, ఈకేవైసీ సర్వే వివరాలు, ఆర్పీలకు, సీవోలకు తెలియజేయాలని, వారు వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుస్తారని చెప్పారు. ఆపై అర్హతలను పరిశీలించి చెక్కులు ఇస్తామని చెప్పారు.