TTD: టీటీడీకి నకిలీ వెబ్సైట్ బెడద: టికెట్ల కొనుగోలులో వెల్లడైన నిజం
- పన్నెండు టికెట్లు కొని మోసపోయిన మహారాష్ట్ర వాసులు
- స్వామి దర్శనానికి రాగా నకిలీవని గుర్తించిన సిబ్బంది
- విజిలెన్స్ కార్యాయంలో ఫిర్యాదు చేసిన భక్తులు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌కు సమాంతరంగా నకిలీ వెబ్సైట్ నడుస్తోన్న వైనం బయటపడింది. టీటీడీ పేరుతో ఉన్న వెబ్సైట్లో కొనుగోలు చేసిన టికెట్లతో స్వామి దర్శనానికి కొందరు భక్తులు వచ్చిన సందర్భంగా ఈ విషయం బయటపడింది.
వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని చిల్వాడాకు చెందిన పంకజ్ కుటుంబ సభ్యులు టీటీడీ వెబ్సైట్లో రూ.3600 వెచ్చించి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను పన్నెండు కొనుగోలు చేశారు. ఈ టికెట్లు పట్టుకుని శుక్రవారం దర్శనానికి వచ్చారు. ఈ టికెట్లను స్కాన్ చేసిన సిబ్బంది అవి నకిలీ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసినవని తేల్చారు. దీంతో లబోదిబోమనడం పంకజ్ కుటుంబం వంతయింది. బాధితులంతా టీటీడీ విజిలెన్స్ కార్యాలయానికి వెళ్లి తమకు జరిగిన నష్టంపై ఫిర్యాదు చేశారు.