governer: సర్వేల పేరుతో వైసీపీ ఓటర్లను తొలగించడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం: వైఎస్ జగన్
- టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారు
- పోలీసు పదోన్నతులలో రాజకీయ స్వార్థం కోసం
- రాజ్ భవన్ లో నరసింహన్ ని కలిసిన జగన్
ఏపీలో సర్వేల పేరుతో వైసీపీ ఓటర్లను తొలగిస్తున్న అంశాన్ని గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశామని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో గవర్నర్ ని జగన్ ఈరోజు కలిశారు. రాజ్ భవన్ కు జగన్, ఆ పార్టీనేతలు వెళ్లి ఈమేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం, మీడియాతో జగన్ మాట్లాడుతూ, గవర్నర్ తో గంటకు పైగా భేటీ అయ్యామని, సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ఢిల్లీలో ఈసీతో చెప్పిన విషయాలను గవర్నర్ కు వివరించినట్టు చెప్పారు. ప్రజాసాధికారత సర్వేల పేరుతో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని, పోలీసు పదోన్నతులను రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు.
ప్రత్యేక హోదాను నీరు గారుస్తూ, హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయంటూ చంద్రబాబు నాడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘హోదా సంజీవినా’ అన్న చంద్రబాబు ప్రతిపక్షాన్ని ఎద్దేవా చేశారని, ప్రత్యేక ప్యాకేజ్ కోసం కేంద్రంలోని టీడీపీ మంత్రులు, ఎంపీలు పాకులాడారని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్న చంద్రబాబు, ఏ రోజూ హోదా గురించి అడగలేదని, ఈరోజు మాత్రం ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేస్తామంటున్నారని సెటైర్లు విసిరారు.