bjp: మూడో నామం పెట్టేందుకు గుంటూరు వస్తున్నారా?: మోదీపై కళా వెంకట్రావు మండిపాటు
- నాడు ప్రత్యేక హోదా ఇస్తామని నామం పెట్టారు
- ఢిల్లీని మించిన అభివృద్ధిని చేస్తామని మరో నామం
- మోదీకి బహిరంగ లేఖ రాసిన కళా వెంకట్రావు
ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారంటూ ప్రధాని మోదీపై ఏపీ మంత్రి కళా వెంకట్రావు నిప్పులు చెరిగారు. మోదీకి రాసిన బహిరంగ లేఖలో ఆయనపై విమర్శలు గుప్పించారు. ప్రధాని అభ్యర్థిగా నాడు తిరుపతి సభలో ప్రత్యేక హోదా ఇస్తామని నామం పెట్టారని, ఢిల్లీని మించిన అభివృద్ధిని చేస్తామని మరో నామం పెట్టారని, ఇప్పుడు గుంటూరు సభలో మూడో నామం పెట్టేందుకు వస్తున్నారా? అని ఆ లేఖలో దుయ్యబట్టారు.
భిన్నత్వంలో ఏకత్వమనే దేశ లక్షణానికి విరుద్ధంగా మోదీ వ్యవహరిస్తున్నారని, తమ సామ, దాన, భేద, దండోపాయాలను టీడీపీ ఎంపీలు అధిగమించారని, అందుకే, లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టారని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నానని చెప్పుకోలేని స్థితికి వచ్చారని, ఇంతకుముందు జైల్లో ఉన్న జగన్ అండ్ కో తమ ముసుగులోని మిత్రులేనని ఆరోపించారు. నూతన రాష్ట్రానికి చాలా చేశామని చెప్పుకుంటున్నారని మోదీని విమర్శిస్తూ ఈ లేఖ రాశారు.