Vijayawada: విజయవాడలో రాత్రికి రాత్రే వెలిసిన మోదీ వ్యతిరేక భారీ హోర్డింగులు!
- గన్నవరం నుంచి గుంటూరుకు దారితీసే మార్గంలో హోర్డింగులు
- సీరియస్ అయిన కేంద్ర అధికారులు, ఎస్పీజీ
- తొలగించే పనులు మొదలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ రాకను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో భారీ హోర్డింగులు ఏర్పాటయ్యాయి. గన్నవరం నుంచి గుంటూరుకు దారితీసే రహదారులపై ఇవి కనిపిస్తున్నాయి. నేడు మోదీ గుంటూరులో పర్యటించి, పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'మోదీ గో బ్యాక్' అంటూ పెద్ద పెద్ద హోర్డింగులు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి హోర్డింగులు పెడితే, వాటిపై ముద్రించిన వారి పేర్లు ఉండాలి. కానీ వీటిపై ఎవరు ఏర్పాటు చేశారన్న విషయం లేదు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పథకాలకు ప్రచారం కోసం ఏర్పాటు చేసిన హోర్డింగుల స్థానంలోనే ఇవి కనిపిస్తున్నాయి. కాగా, వీటికి అనుమతులు లేవని, అయినా వీటిపై ఎలా స్పందించాలో తెలియడం లేదని రాష్ట్ర అధికారులు అంటుండగా, ప్రధాని పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కేంద్ర అధికారులు, ఎస్పీజీ మాత్రం హోర్డింగులపై ఆగ్రహంగా ఉంది.
వాటిని ఎవరు ఏర్పాటు చేశారో తెలపాలని గుంటూరు, కృష్ణా జిల్లాల రెవెన్యూ అధికారులు, పోలీసులను కేంద్రం ప్రశ్నించినట్టు సమాచారం. ఇవన్నీ శుక్రవారం రాత్రికి రాత్రే ఏర్పాటు చేయగా, శనివారం రాత్రి కొన్నింటిని తొలగించారు. అయినా, రహదారిపై ఇంకా చాలా హోర్డింగులు కనిపిస్తున్నాయని సమాచారం.