Chandrababu: నా రాష్ట్రంపైకి మోదీ యుద్ధానికి వస్తున్నారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- నేడు ప్రధాని ఏపీ పర్యటన
- మోదీ నేతృత్వంలో వ్యవస్థలన్నీ నాశనం
- కన్నా లక్ష్మీనారాయణ వైకాపా ఏజంటే
- టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
తన రాష్ట్రంపై యుద్ధం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేడు వస్తున్నారని, ఆయనకు ఏపీ ప్రజల నిరసన ఎలా ఉంటుందో తెలియజేయాలని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, మోదీ నేతృత్వంలో దేశంలోని వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని, ఆయన తన స్వార్థంతో దేశాన్ని భ్రష్టు పట్టించారని నిప్పులు చెరిగారు. ఈశాన్య రాష్ట్రాలన్నీ బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి ఆయన్ను అధికారానికి దూరం చేయనున్నాయని అన్నారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో మోదీపై తీవ్రమైన ఆగ్రహం ఉందని, ఆయన ఏ రాష్ట్రానికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛదంగా ముందుకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను ఎగతాళి చేయడానికే ఆయన నేడు పర్యటించాలని నిర్ణయించుకున్నారని, నిరసనలన్నీ శాంతియుతరంగా సాగాలని, ప్లజలు తమలోని ఆగ్రహాన్ని మోదీకి తెలిసేలా చేయాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తప్ప, ప్రతిఒక్కరూ మోదీ రాకను వ్యతిరేకిస్తున్నారని, మోదీ సభకు ప్రజలను తరలిస్తామని ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీ మేరకే మోదీ, తన పర్యటనను ఖరారు చేసుకున్నారని విమర్శల వర్షం కురిపించారు.
కన్నా లక్ష్మీనారాయణ వైకాపా పార్టీకి ఏజంటు వంటి వాడని, అరాచక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మోదీ ప్రయాణిస్తున్న మార్గంలో రెండు కుండలను పగులగొట్టాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ రెండు కుండలూ బీజేపీ, వైసీపీలను సూచించాలని అన్నారు. రాష్టానికి అన్యాయం చేసిన మోదీని ప్రశ్నించడంలో జగన్ పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. తాను మోదీపై అవిశ్వాసాన్ని పెడితే, తన ఎంపీలతో రాజీనామా చేయించిన ఘనత జగన్ దని, రాజీనామాలతో మోదీ సర్కారుకు మేలు చేయించినట్లయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగు జాతికి జగన్ తక్షణం క్షమాపణలు చెప్పాలని లేకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.