kanna: కన్నాకు తీవ్ర అవమానం.. గన్నవరం ఎయిర్ పోర్టులోకి అనుమతించని ప్రధాని భద్రతా సిబ్బంది !
- నేడు గుంటూరుకు రానున్న మోదీ
- జాబితాలో పేరు లేదంటూ కన్నాను అడ్డుకున్న భద్రతా సిబ్బంది
- ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ బీజేపీ చీఫ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత నాలుగున్నరేళ్లలో ఏమేం చేశామో చెప్పడానికి బీజేపీ ఈరోజు గుంటూరులో ‘ప్రజా చైతన్య సభ’ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టుకు వెళ్లిన బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు తీవ్ర అవమానం ఎదురైంది.
జాబితాలో పేరు లేదంటూ విమానాశ్రయంలోకి కన్నాను పంపడానికి ప్రధాని భద్రతా సిబ్బంది నిరాకరించారు. దీంతో కన్నా స్పందిస్తూ..‘నేను మోదీ గారితో కలిసి హెలికాప్టర్ లో గుంటూరుకు వెళ్లాల్సి ఉంది. దయచేసి అనుమతించండి’ అని కోరినా అధికారులు అంగీకరించలేదు. ఈ ఘటనపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా బీజేపీ శ్రేణులు గుమిగూడటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మోదీని ఆహ్వానించడానికి గన్నవరం విమానాశ్రయానికి గవర్నర్ నరసింహన్ చేరుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవ్వరూ ముందుకు రాలేదు.