Chandrababu: పరిపాలించే అర్హత ఏమాత్రం లేని ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ: చంద్రబాబు
- రాష్ట్రంపై కక్ష సాధింపు ధోరణి
- న్యాయమైన డిమాండ్లతో దీక్ష చేస్తున్నాం
- నరేంద్ర మోదీ ఆటలిక సాగవు
- ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు
ప్రస్తుతం ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోదీకి, పరిపాలించే అర్హత ఎంతమాత్రమూ లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. న్యూఢిల్లీలో ధర్మపోరాట దీక్షను ప్రారంభించిన ఆయన, ఆపై ప్రసంగించారు. చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రంపై కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమని, నీచమని, మంచి పద్ధతి కాదని అన్నారు. గతంలో ఏపీ భవన్ సాక్షిగా ఎన్నో ఉద్యమాలు చేశామని, అవన్నీ విజయవంతం అయ్యాయని, ఇప్పుడు న్యాయమైన డిమాండ్లతో చేస్తున్న ఈ దీక్ష కూడా విజయవంతం అవుతుందని అన్నారు. మోదీ అడుగుతున్నట్టుగా లెక్కలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అదే లెక్కలు మోదీ కూడా చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
"ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉంది. పరిపాలించే వ్యక్తులు... ప్రజల మనోభావాలను గుర్తు పెట్టుకుని, పరిపాలిస్తే, దేశ సమగ్రతకు భంగం కలగకుండా ఉండే పరిస్థితి వస్తుంది. మేము ఢిల్లీలో ఉన్నాం. మాకు అధికారం ఇచ్చారు. మెజారిటీ ఉంది. మా ఇష్ట ప్రకారం మేము చేస్తామంటే... మీ ఆటలు సాగవని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
పరిపాలించే వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. బాధ్యత విస్మరించి, ఇష్టానుసారం చేస్తామని, అధికారం నెత్తికెక్కినప్పుడు... మళ్లీ ఆ నెత్తికెక్కిన అధికారాన్ని దించే అధికారం ఈ ప్రజలకు ఉందని గుర్తు పెట్టుకోవాలి. మనం పోరాడేది మన కోసం కాదు... ఐదు కోట్ల మంది ప్రజల కోసం పోరాడుతున్నాం. భావి తరాల కోసం పోరాడుతున్నాం. ఆత్మాభిమానం కోసం పోరాడుతున్నాం. జీవితంలో ఆస్తులు పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించుకోవచ్చుగానీ, ఆత్మగౌరవాన్ని పొగొట్టుకుని బతకలేమని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు" అని చంద్రబాబు అన్నారు.
ఈ ఢిల్లీలో న్యాయం జరగాల్సిన అవసరం ఉందని, అందుకు అందరి సహకారం తీసుకుంటామని, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అహంభావాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రశ్నించినందుకు నిందలు వేస్తున్న వ్యక్తులకు గుణపాఠం చెప్పే సమయం తొందర్లోనే ఉందని అన్నారు. తెలుగువారి సత్తా, ప్రజల నాడి తెలియని వ్యక్తి నరేంద్ర మోదీ అని విమర్శల వర్షం కురిపించారు.