kanna lakshminarayana: మా ప్రధాని మోదీ అడవి సింహం...టీడీపీ నాయకులు గ్రామ సింహాలు : కన్నా తీవ్ర వ్యాఖ్యలు
- చంద్రబాబు మతిస్థిమితం లేనట్లు మాట్లాడుతున్నారు
- ప్రధాని భార్య గురించి వ్యాఖ్యానించడం సరికాదు
- బాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గుంటూరు సభ సక్సెస్ అయ్యింది
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ఇతర నేతలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన పరివారం ఎన్ని ఆటంకాలు సృష్టించినా గుంటూరులో జరిగిన ప్రధాని మోదీ సభ విజయవంతమయిందన్నారు. ఇది జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
తమ ప్రధాని అడవి సింహమైతే, టీడీపీ నాయకులు గ్రామ సింహాలని ఘాటుగా సమాధానమిచ్చారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పిన వ్యక్తిలా మోదీ భార్యపైనా విమర్శలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. అవినీతికి ప్పాడుతున్నారు కాబట్టే తండ్రీకొడుకులపై మోదీ విమర్శలు చేశారన్నారు. ఎయిమ్స్, ఎయిర్పోర్ట్సు, జాతీయ రహదారి అభివృద్ధి పనుల్లో తండ్రీకొడుకులు కమీషన్లు తీసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో బీజేపీ చెబుతుంటే ప్రజలు విశ్వసిస్తున్నారని, ఏమీ చేయలేదని చంద్రబాబు చెబుతున్నా నమ్మడం లేదని, అదే బాబులో అసహనాన్ని పెంచుతోందని అన్నారు.