West Bengal: శారదా స్కాం కేసు పర్యవేక్షణకు 'నో' చెప్పిన సుప్రీంకోర్టు

  • కమిటీ ఏర్పాటు ఉద్దేశం లేదని స్పష్టీకరణ
  • ఇప్పటికే కోల్‌కతా కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను విచారించిన సీబీఐ
  • కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ 'శారదా చిట్ ఫండ్ కుంభకోణం' కేసు పర్యవేక్షణకు అపెక్స్‌ కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ ఇటీవల కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు ఆయన ఇంటికి వెళ్లగా వివాదం చెలరేగింది. స్థానిక పోలీసులు సీబీఐ అధికారులను అడ్డుకుని నిర్బంధించడం, కేంద్రం తీరును నిరసిస్తూ మమతా బెనర్జీ దీక్షకు దిగడం తెలిసిందే. దీనిపై సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించగా రాజీవ్‌కుమార్‌ విచారణకు హాజరు కావాల్సిందేనని, కానీ ఆయనను అరెస్టు చేయవద్దంటూ అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పడంతో తాత్కాలికంగా ఆ వివాదం కొలిక్కివచ్చింది.

ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి పర్యవేక్షక కమిటీని నియమించాలని శారదా చిట్ ఫండ్స్ డిపాజిట్ దారులు కొందరు అపెక్స్‌ కోర్టును కోరగా, ఇందుకు న్యాయమూర్తి నిరాకరించారు. కాగా, కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే సీబీఐ అధికారులు శనివారం 9 గంటలపాటు కోల్‌కతా సీపీ రాజీవ్‌కుమార్‌ను విచారించారు. అలాగే, తృణమూల్‌ మాజీ ఎంపీ కునాల్‌ఘోష్‌ను విచారించారు. వీరిద్దరి వద్ద నుంచి కేసుకు సంబంధించి అధికారులు కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో సీబీఐ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News