Narendra Modi: విలువ వేలల్లో, వచ్చింది లక్షల్లో... మోదీ బహుమతుల వేలంతో భారీ ఆదాయం!
- వివిధ పర్యటనల్లో వచ్చిన కానుకల వేలం
- 1,800 మెమొంటోల విక్రయం
- గంగానది ప్రక్షాళనకు నిధులు
ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాలు, ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్లిన సమయంలో ఆయనకు కానుకలుగా వచ్చిన 1,800 పైగా వస్తువులు, మెమొంటోల వేలం తరువాత ప్రధానమంత్రి కార్యాలయం భారీగా నిధులను ఆర్జించింది. ఈ డబ్బును గంగానది ప్రక్షాళనకు చేపట్టిన 'నమామి గంగే' కార్యక్రమానికి వినియోగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. గడచిన రెండు వారాలుగా న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడ్రన్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఈ వేలం జరిగింది. చెక్కతో తయారు చేసిన ఓ బైక్ కు, నరేంద్ర మోదీ స్వయంగా గీసిన చిత్రానికి రూ. 5 లక్షల చొప్పున ధర పలికింది. సుమారు రూ. 5 వేలు విలువ ఉండే శివుని విగ్రహానికి రూ. 10 లక్షల ధర వచ్చింది. దాదాపుగా రూ. 4 వేలు విలువ చేసే చెక్కతో చేసిన అశోక స్తంభం ప్రతిరూపానికి రూ. 13 లక్షల ధర లభించింది. రూ. 2 వేలు విలువ చేసే అస్సాంలోని మజూలి సంప్రదాయ ‘హొరాయి’ని వేలం వేయగా, రూ. 12 లక్షలు వచ్చింది. రూ. 4 వేలు ఖరీదు చేసే గౌతమ బుద్ధుడి బొమ్మకు రూ. 7 లక్షల ధర లభించిందని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది.