Andhra Pradesh: పిల్లలు పుట్టలేదని.. భార్యను చీకటి గదిలో నిర్బంధించిన ప్రబుద్ధుడు!
- ఏపీలోని కడప జిల్లాలో ఘటన
- రెండో పెళ్లి చేసుకున్న జిల్లా వాసి
- మానవహక్కుల సంఘం చొరవతో బాధితురాలికి విముక్తి
పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త రాక్షసుడిగా మారిపోయాడు. ఆమెకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడంతో పాటు ఓ చీకటి గదిలో బాధితురాలిని నిర్బంధించాడు. చివరికి మానవహక్కుల సంఘం ప్రతినిధులు రంగంలోకి దిగడంతో సదరు భార్యకు విముక్తి లభించింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాకు చెందిన గౌసియాకు 20 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. గౌసియాకు పిల్లలు పుట్టకపోవడంతో సదరు భర్త ఆమెను పట్టించుకోవడం మానేశాడు. అంతేకాకుండా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా గౌసియాను కొన్నిరోజుల క్రితం ఇంటిలోని ఓ చీకటి గదిలో బంధించేశాడు.
అయితే తమ కుమార్తె కనిపించకపోవడంతో గౌసియా తల్లిదండ్రులు, బంధువులు సదరు భర్తను నిలదీశారు. అనంతరం ఏపీ మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో కమిషన్ సభ్యులు పోలీసుల సహకారంతో గౌసియాకు చీకటి చెర నుంచి విముక్తి కల్పించారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామనీ, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు.