Andhra Pradesh: రేపు రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తాం.. కేవలం 11 మందికే పర్మిషన్ దొరికింది!: సీఎం చంద్రబాబు
- ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ర్యాలీ
- కేంద్రం అన్యాయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
- ధర్మపోరాట దీక్ష ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను రేపు కలవబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే తనను కలుసుకునేందుకు కేవలం 11 మందికి మాత్రమే కోవింద్ అనుమతి ఇచ్చారని వెల్లడించారు.
అందువల్ల రేపు ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ర్యాలీగా వెళతామని పేర్కొన్నారు. అక్కడి నుంచి 11 మంది సభ్యులు రాష్ట్రపతిని కలిసి ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యాన్ని ఆయన దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరుగుతున్న ధర్మపోరాట దీక్ష ముగింపు సభలో చంద్రబాబు మాట్లాడారు.
విభజన చట్టంలో 18 హామీలతో పాటు ఏపీకి ప్రత్యేకహోదాను 5 సంవత్సరాల పాటు ఇస్తామని పార్లమెంటులో ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గత ఐదేళ్లుగా పోరాడుతూనే ఉన్నామని స్పష్టం చేశారు. ‘మోదీ మనసు మారుతుంది.. ఏపీకి న్యాయం జరుగుతుందనే అమరావతి శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించాం. ఆయన్ను గౌరవించాం. కానీ ఆయన ఏపీ ప్రజల ముఖాన పార్లమెంటులో మట్టి, యమునా నీళ్లు కొట్టి ఢిల్లీకి వెళ్లిపోయారు’ అని దుయ్యబట్టారు.
ఇప్పటికీ మించిపోయింది లేదనీ, చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న రాజకీయ నేతలు, వ్యక్తులకు చంద్రబాబు ఐదు కోట్ల మంది ఆంధ్రుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.