New Delhi: ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: 17కు పెరిగిన మృతుల సంఖ్య!
- అర్పిత్ ప్యాలెస్ లో ఘోర అగ్నిప్రమాదం
- ఊపిరాడక కన్నుమూసిన అత్యధికులు
- క్షతగాత్రులకు ఉచిత వైద్యం
దేశ రాజధాని న్యూఢిల్లీలోని అర్పిత్ ప్యాలెస్ హోటల్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. హోటల్ లో ఈ తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరుగగా, హోటల్ లో బసచేసి నిద్రిస్తున్న వారిలో అత్యధికులు పొగకు ఊపిరాడక కన్నుమూశారని అధికారులు తెలిపారు.
మంటలు వ్యాపించగానే, భవంతి నుంచి బయట పడేందుకు పలువురు కిటికీల నుంచి, టెర్రస్ నుంచి కిందకు దూకారు. ఈ క్రమంలో ఓ మహిళ, చిన్నారి మరణించారు. ప్రస్తుతం మంటలైతే అదుపులోకి వచ్చాయిగానీ, భవనంలో చిక్కుకున్న వారి జాడ తెలియరాకపోవడంతో, ఫైర్ ఫైటర్స్ వారి కోసం గాలిస్తున్నారు. మొత్తం మూడు అంతస్తులుండే అర్పిత్ ప్యాలెస్ లో దాదాపు 70 మందికి పైగా బస చేసివుండగా, హోటల్ సిబ్బంది మరో 20 మంది వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం చేయిస్తున్నామని పేర్కొంది.