chiranjeevi: చిరంజీవి ఓ చోటా రాజన్.. అల్లు అరవింద్ ఓ దావుద్ ఇబ్రహీం: నాగబాబు
- నాలుగు కుటుంబాలు, దిల్ రాజు, అరవింద్.. ఇంతకు మించిన మాఫియా ఏముంటుంది?
- ఫలానా సినిమా కోసం వేరే సినిమాను ఆపమని ఎవరూ చెప్పరు
- కథలో దమ్ముంటేనే సినిమాలు ఆడతాయి
ప్రముఖ సినీ నటుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నో విషయాలపై స్పందిస్తున్నారని.... కానీ సినీ రంగం నలుగురు పెద్దల చేతిలో ఉందనే వార్తలపై మాత్రం ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
సురేష్ బాబు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఈ నలుగురు... మరోవైపు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, అల్లు అరవింద్... ఇంతకు మించిన పెద్ద మాఫియా ఎవరుంటారని చమత్కరించారు. తామే పెద్ద మాఫియా అని... తన అన్నయ్య చిరంజీవి ఓ చోటా రాజన్ అని, అల్లు అరవింద్ ఓ దావూద్ ఇబ్రహీం అంటూ చమత్కరించారు.
చిన్న సినిమాలు విడుదల కాకపోవడమనేది డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన అంశమని నాగబాబు అన్నారు. ఫలానా వాళ్ల సినిమా విడుదల అవుతోంది, వేరే సినిమాను విడుదల కాకుండా ఆపండని సినీ పెద్దలు ఎవరూ అనరని చెప్పారు. ఈ నలుగురి చేతుల్లోనే పరిశ్రమ ఉన్నట్టయితే.. వారికి కూడా ఫ్లాప్ లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కొన్ని థియేటర్లు అరవింద్, దిల్ రాజుల చేతుల్లో ఉన్నప్పటికీ... తమ చేతిలో పవర్ ఏమీ ఉండదని చెప్పారు.
ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావని... ఇలాంటి సమయంలో చిన్న సినిమాలను విడుదల చేసుకోవచ్చు కదా? అని నాగబాబు అన్నారు. బిజీ టైమ్ లోనే సినిమాను విడుదల చేయాలని అందరూ అనుకుంటారని... కానీ, ఎక్కువ డబ్బు వచ్చే సినిమానే డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటారని చెప్పారు. కథలో దమ్ముంటేనే సినిమాలు ఆడతాయని అన్నారు. ప్రస్తుత కాలంలో 3 నుంచి 4 వారాలకు మించి ఆడే దమ్ము పెద్ద సినిమాలకు కూడా లేదని చెప్పారు.